Home / పెన్ పోటు / ”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని నెల‌ల క్రితం ముoద్దుగా ‘అజ్ఞాత‌వాసి’ అని సంబోధించిన‌ ‘మాజీ టీవీ9 సిఈఓ ర‌విప్ర‌కాష్‌’కు ఈ సామెత అచ్చ‌గుద్దిన‌ట్టు స‌రిపోతుంది.. స్క్రీన్ మీద నీతులు వ‌ల్లించ‌డంలో ఈయ‌న గారిని మించిన వారు లేరు.. అయితే నిజం నిల‌క‌డ మీద బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న పెద్ద‌ల మాట ఈ ”గురివింద” విష‌యంలోనూ తేట‌తెల్లం అయ్యింది.. ఈ ప్ర‌పంచంలో తాను ఒక్క‌డినే నీతి వంతుడిని అంటూ క‌బుర్లు చెప్పిన ర‌విప్ర‌కాష్‌.. త‌న‌ను తాను నిరూపించుకునేందుకు అవ‌కాశం ఇచ్చిన సంస్థను నాశ‌నం చేయ‌డానికి ప‌న్నిన కుట్ర చూస్తే అత‌ను ఎంత క్రిమిన‌ల్ అన్న విష‌యం అర్ధం అవుతుంది.. టీవీ9 తాజా యాజ‌మాన్యం పెట్టిన కేసు వివ‌రాలు ప‌రిశీలిస్తే.. అన్నం పెట్టిన సంస్థ‌కే సున్నం పెట్టే ప్ర‌య‌త్నం చేసిన ఇత‌గాడు., ఆ సంస్థ‌ను అడ్డుపెట్టుకుని ఇంకెన్ని ఆకృత్యాలు చేసి ఉంటాడో అని ముక్కున వేలేసుకోక త‌ప్ప‌దు..

ఇదిగో ఆ ఫోర్జ‌రీ కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి..

• టీవీ9 లోగోలను అడ్డదారిన అమ్మేందుకు రవిప్రకాశ్ పన్నిన కుట్రను భగ్నం చేసిన కొత్త యాజమాన్యం
• కాపీరైట్ చట్టప్రకారం ఉండే గడువులోపు ఈ వ్యవహారాన్ని గుర్తించి లోగోలకు సంబంధించి పూర్తి హక్కులను కాపాడుకున్న కొత్త యాజమాన్యం
• రవిప్రకాశ్‌పై పోలీసులకు, కాపీరైట్ అథారిటీకి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు
• టీవీ9 లోగో కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవిప్రకాశ్‌ భారీ కుట్ర
• కుట్రలో భాగస్వామిగా మోజో టీవీ ఎండీ హరికిరణ్ చేరెడ్డి
• తనను బ్రాండ్‌గా మార్చిన సంస్థకే బ్రాండ్‌ను లేకుండా చేయాలనుకున్న రవిప్రకాశ్‌
లోగోల అమ్మకం ద్వారా టీవీ9 సంస్థను నిర్వీర్యం చేయాలన్న కుట్రతో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన అక్రమాలు, భారీ కుట్రలను కొత్త యాజమాన్యం భగ్నం చేసింది.
కొత్త యాజమాన్యం సంస్థ బాధ్యతలు చేపట్టకుండా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడంతో పాటు, NCLTలో దొంగ కేసులు కూడా వేయించిన రవిప్రకాశ్‌, చివరకు టీవీ9 చానళ్ల లోగోలను కూడా అమ్మేసినట్లు పత్రాలు సృష్టించే స్థాయికి దిగజారిపోయారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సంపాదించిన ఏబీసీఎల్ యాజమాన్యం, రవిప్రకాశ్‌పై పోలీసులకు, కాపీరైట్‌ అథారిటీకి సకాలంలో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసింది.
మెరుగైన సమాజం కోసం పనిచేస్తానంటూ చెప్పుకొచ్చిన రవిప్రకాశ్‌ … ఎంతటి దుర్మార్గానికైనా తెగిస్తారన్న సంగతిని ఈ వ్యవహారం బట్టబయలు చేసింది. తనకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సంస్థనే నిర్వీర్యం చేయాలనుకున్న రవిప్రకాశ్‌ వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా బయటపడింది.
ఇక వివరాల్లోకి వెళితే… ఏబీసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్‌ తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో న్యూస్ చానళ్లను నిర్వహిస్తోంది. ఇంగ్లీష్ చానల్ న్యూస్ 9 పేరుతో నడుస్తుండగా, మిగిలిన చానళ్లన్నీ టీవీ9 లోగోతోనే కొనసాగుతున్నాయి. ఏ చానల్‌కైనా లోగోనే కీలకం. ఆ లోగో ఆధారంగానే దాని వ్యాపారం, కార్యకలాపాలు కొనసాగుతాయి. ఏబీసీఎల్ పాతయాజమాన్యం కళ్లుగప్పి టీవీ9లో తాను పాడిందే పాట.. ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరించిన రవిప్రకాశ్‌, కొత్త యాజమాన్యం చేతుల్లోకి సంస్థ వెళ్లిపోవడంతో తన ఆటలు సాగవని తెలుసుకున్నారు. మార్కెట్ పరంగా ఎంతో విలువైన టీవీ9లోగోలు కొత్త యాజమాన్యానికి దక్కకుండా కుట్ర పన్నారు. టీవీ9 లోగోలు ఎప్పటికీ తన చేతుల్లోనే ఉండాలన్న దురుద్దేశంతో తన అనుచరుడు, మోజో టీవీ ఎండీ హరికిరణ్ చేరెడ్డికి గ్రూప్‌ చానళ్లలో అత్యంత కీలకమైన మూడు లోగోలను అమ్మేసినట్లు పత్రాలను సృష్టించారు.
టీవీ9 కొత్త యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే, రవిప్రకాశ్‌, ఏబీసీఎల్‌లోని మరో డైరెక్టర్ ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్ చేరెడ్డి కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. టీవీ9 లోగోలకు సంబంధించిన రిజిస్టర్డ్‌ ట్రేడ్‌మార్క్స్‌, కాపీరైట్‌ హక్కులను డిసెంబర్ 31, 2018న మోజో టీవీని నిర్వహిస్తున్న మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కేవలం రూ.99,000/- కు రవిప్రకాశ్ విక్రయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. మే 22, 2018న మౌఖికంగా కుదిరిన ఒప్పందం మేరకు లోగోలను విక్రయిస్తున్నామంటూ ఈ పత్రాల్లో పేర్కొన్నారు. లెక్కల్లో చూపడం కోసం మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 99వేలను జనవరి 22, 2019న ఏబీసీఎల్‌ అకౌంట్‌లోకి బదలాయించారు. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం రిపేర్లు, నిర్వహణకు అయిన ఖర్చుల రూపేణా అంటూ రికార్డుల్లో ఈ డబ్బును చూపించారు.
ఇక్కడే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి…
1. విశేషమైన ప్రజాదరణ ఉన్న చానల్‌కు అత్యంత విలువైన లోగోను ఎవరైనా అమ్ముకుంటారా..?
2. చానల్‌ లోగోలను అమ్మే అధికారం ఓ డైరెక్టర్, సీఈవోకు ఉంటుందా..?
3. చానల్ లోగోలను అమ్మేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి ఎందుకు తేలేదు?
4. లోగోలను కొన్నందుకు చెల్లించినట్లు చెబుతున్న డబ్బును, ఎవరైనా రిపేర్లు, నిర్వహణ ఖర్చుల పేరుతో తీసుకుంటారా?

ఈ లోగోల విక్రయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తే, రవిప్రకాశ్‌ ఎంత దారుణమైన కుట్రకు పాల్పడ్డారో అర్థమవుతుంది. ఈ లోగో విక్రయం జరిగినట్లు చెబుతున్న సమయానికి కొత్త యాజమాన్యం చేతుల్లోకి ఏబీసీఎల్‌ సంస్థ వెళ్లిపోయింది. ఆగస్టు 27,2018న ఏబీసీఎల్‌లోని 90.54 శాతం షేర్లను కొనుగోలు చేసింది అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌. అంటే, ఆ తేదీ నుంచి ఏబీసీఎల్‌ నియంత్రణ పూర్తిగా అలంద చేతుల్లోకి వెళ్లిపోయింది. కంపెనీలో జరిగే విధానపరమైన నిర్ణయాలన్నీ వీరికి తెలియకుండా చేయడానికి వీలు లేదు. దీనికి తగ్గట్లుగానే డిసెంబర్ 23, 2018న ఇద్దరిని, జనవరి 30, 2019న మరో ఇద్దరిని ఏబీసీఎల్‌లో కొత్త డైరెక్టర్లుగా అలంద నియమించింది.

కానీ, రవిప్రకాశ్‌ ఇక్కడే తన కుట్రను అమలు చేశారు. పాత యాజమాన్యం హయాంలోనే అంటే మే 22, 2018న లోగోల విక్రయానికి మౌఖిక ఒప్పందం కుదిరిందంటూ నాటకం ఆడారు. ఒకవేళ నిజంగా అలాంటి ఒప్పందం కుదిరిందనుకున్నా.. ఆ విషయాన్ని కంపెనీ వాటాదార్లకు వెంటనే రాతపూర్వకంగా తెలియజేసి, వారి అనుమతి తీసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్‌, సీఈవోపై ఉంటుంది. కానీ దాన్నెప్పుడూ రవిప్రకాశ్ ప్రస్తావించలేదు. ఇక ట్రేడ్‌మార్కులు, కాపీరైట్ హక్కులు అమ్ముతూ అగ్రిమెంట్‌ చేసే సమయానికి ఉన్న కొత్త యాజమాన్యానికి సమాచారం ఇవ్వలేదు. అసలు సంస్థకు అత్యంత కీలకమైన, ఎంతో విలువైన ఇలాంటి ట్రేడ్‌మార్కులు, కాపీరైట్ హక్కులు అమ్మాలంటే, కంపెనీస్ యాక్ట్‌, 2013లోని సెక్షన్ 180 ప్రకారం సంస్థలోని షేర్‌ హోల్డర్ల అనుమతి తప్పనిసరి. కానీ, రవిప్రకాశ్ మాత్రం ఎవరి అనుమతీ తీసుకోకుండానే లోగోలను విక్రయించేశారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే…
1. రవిప్రకాశ్‌ది ఎంత క్రిమినల్‌ మైండో అర్థమైపోతుంది.
2. టీవీ9 లోగోకు ఓ బ్రాండ్‌గా ప్రజల్లో గుర్తింపు రావడం వెనుక సంస్థలో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది ఉద్యోగుల కృషి ఉంది. దాన్ని కేవలం రూ.99,000కు ఓ డమ్మీ కంపెనీకి అమ్మేసినట్లు రవి ప్రకాశ్ పత్రాలు సృష్టించారు.
3. ఇక ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నట్లు మోజో టీవీ కూడా రవిప్రకాశ్‌దే అన్న వాదనకు ఈ లోగోల విక్రయ ఒప్పందం బలం చేకూర్చుతోంది. మోజోటీవీ ఎండీ హరికిరణ్ చేరెడ్డికే లోగోలను విక్రయిస్తున్నట్లు పత్రాలు పుట్టించారు రవిప్రకాశ్‌. అంటే.. మోజో టీవీనే.. టీవీ9గా మార్చి లబ్ది పొందాలన్న కుట్రకు పాల్పడినట్లు అర్థం చేసుకోవచ్చు.
4. NCLT మధ్యంతర ఉత్తర్వులను సాకుగా చూపుతూ కేవలం 40వేల షేర్లను శివాజీకి బదలాయించలేదని చెప్పిన రవిప్రకాశ్‌, అదే సమయంలో అత్యంత విలువైన టీవీ9 లోగోలను మాత్రం అమ్మేయడం, అదీ కేవలం రూ.99 వేలకే కట్టబెట్టడం ఆయన దురుద్దేశాన్ని బయటపెడుతోంది.
5. రవిప్రకాశ్ కుట్రలను చేధించుకుని కంపెనీ నిర్వహణను చేపట్టిన కొత్త యాజమాన్యం చేస్తున్న రికార్డుల తనిఖీల్లో ఈ వ్యవహారం అంతా బయటపడింది. కొత్త యాజమాన్యం కంపెనీ నియంత్రణను చేపట్టే విషయంలో మరింత ఆలస్యం చేసి ఉంటే, రవిప్రకాశ్ మరెన్నో కుట్రలను అమలు చేసే వారనడానికి ఈ ఉదంతమే ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు. దానివల్ల సంస్థకు, యాజమాన్యానికి, ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగి ఉండేది.
6. రవిప్రకాశ్ చేసిన ఈ కుట్రపై ఇప్పటికే కాపీరైట్ అథారిటీకి కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కాపీరైట్‌ చట్టంలోని ఉన్న నిబంధనల ప్రకారం గడువులోపే ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో, టీవీ9 లోగోలపై పూర్తి హక్కులు ఏబీసీఎల్‌కే ఉండేలా మార్గం సుగమం అయ్యింది.
మొత్తంగా చూస్తే.. టీవీ9ను అడ్డగోలుగా దక్కించుకోవడం కోసం రవిప్రకాశ్‌ ఎన్నో ఫోర్జరీలకు పాల్పడడం ఆయన నేర మనస్తత్వాన్ని బయటపెడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీడియా నయీంగా మారిపోయాడు రవిప్రకాశ్‌. పోలీసులు ఇస్తున్న నోటీసులకు స్పందించకపోవడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం చూస్తుంటే, ఆయన చేసిన తప్పులు ఎంత పెద్దవో తెలిసిపోతుంది.

Share This:

2,264 views

About Syamkumar Lebaka

Check Also

నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

సత్యమేవ జయతే అంటూ దెయ్యాలు “వేదాలు” వల్లిస్తున్నాయి? దుర్మార్గులు “సన్మార్గం” గురించి మాట్లాడుతున్నారు! ప్రస్తుత మన రాజకీయ-మీడియా పరిస్థితులు చూస్తుంటే, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + seventeen =