Home / ఎడిటోరియల్స్ / కార్మిక, కర్షక వర్గాలకు కూడా ప్రాధాన్యము ఇచ్చే కొత్త ప్రభుత్వాలు రావాలి!!!

కార్మిక, కర్షక వర్గాలకు కూడా ప్రాధాన్యము ఇచ్చే కొత్త ప్రభుత్వాలు రావాలి!!!

చాతుర్వర్ణ వ్యవస్థలో భాగాలు అయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్రులను ఆర్యులు తీసికొచ్చారు అంటారు. మొదటి మూడు వర్ణాలలో విభాగాలు, కులాలు పుట్టలేదుగాని సూద్రులలో మాత్రము కులవృత్తి కోక కులం పుట్టుకొచ్చింది. అదే వారి అనైక్యతకి కారణము. అధికారానికి చేరుకోకపోవడానికి అదే కారణము. కాలానుగుణముగా సూద్రులు తమ తమ కులాల పేరులను ఆధునికంగా మార్చుకొన్నారు గాని, కులవ్యవస్థలకు వ్యతిరేకముగా పోరాడిన దాఖలాలు లేవు.

అంబెడ్కర్, రామ్ మనోహర్ లోహియా తప్పించి అగ్రవర్ణాల ఆధిపత్యముపై పోరాడిన నాయకులు నేటివరకు రాలేదు అనే చెప్పాలి. అటువంటివారు వచ్చినా బతికి బట్టకట్టినవారు లేరు అనే చెప్పాలి. కాన్షిరాం, మాయావతి లాంటివారు ఉత్తరాదిలో కొంత వరకు విజయము సాధించిన, మన రాష్ట్రములో అటువంటి ప్రయత్నము జరగలేదనే చెప్పాలి.

విచిత్రము ఏమిటంటే సూద్రులనుండి వచ్చి పాలక వర్గాలుగా మారిన కమ్మ, రెడ్డి లాంటి వారు కూడా మిగిలిన వర్గాలను అణచివేస్తూ అదే ఆధిపత్య ధోరణిని కొనసాగించడము చూస్తున్నాము. ఒకప్పుడు అగ్ర కులమనేది జన్మతా వచ్చేది కానీ నేడు అగ్ర కులం అనేది వారికి వస్తున్న అధికారమును బట్టి వస్తున్నది అని గ్రహించాలి. అధికారంలోకి వచ్చిన నేటి పాలక వర్గాలు పురాతన కాలములో కంటే ఎక్కువగా మిగిలిన కులాలను అణచివేస్తున్నాయి.

కాలక్రమేణా చాతుర్వర్ణ వ్యవస్థపోయి చాతుర్వర్గ వ్యవస్థ వచ్చింది. పాలకులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మిక-కర్షక వర్గాలే నేటి చరితుర్వర్గ వ్యవస్థలోని భాగాలు. కులాలు ఏమైనా, మతాలు ఏమైనా ఈ మూడు వర్గాల్లో ఏదో వర్గములో కలవడానికి నిత్య పోరాటం చేస్తున్నారు. నిత్య పోరాటంలో నెగ్గలేని వారు కార్మిక కర్షక వర్గములో గతిలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు.

పాలక, వ్యాపార వర్గాలు అనాదిగా కలిసే ఉంటున్నారు. వీరిలో వీరు సహకరించుకొంటూ ఉంటారు. మూడో వర్గమైన ఉద్యోగవర్గము (మేధావి వర్గము) అయితే జీతము కోసము తమ మేధస్సుని “పై రెండు వర్గాలకు” ఎప్పుడూ అమ్మేసికొంటూ ఉంటారు. వీరికి తమ మనుగడకు కావాలిసిన డబ్బే ప్రధానము తప్ప పాలక, వ్యాపార వర్గాలు చేస్తున్న అరాచకాలు గురించి పట్టించుకోరు. కార్మిక-కర్షక వర్గాల నుండి వచ్చి ఉద్యోగవర్గములో చేరిన వారు కూడా ఉద్యోగ వర్గపు ఆలోచనలే తప్ప తమ మూలాల గురించి ఆలోచించక పోవడము కార్మిక కర్షక వర్గాల దురదృష్టమనే చెప్పాలి.

అందుకనే ఏ ప్రభుత్వములోనైనా పాలక, వ్యాపారవర్గాలకు అనుకూలమైన చట్టాలనే ఈ ఉద్యోగవర్గము తయారు చేస్తూ ఉంటుంది. ఉద్యోగవర్గానికి కావలిసిన జీతము కోసము చట్టాలను మాత్రము పాలక, వ్యాపార వర్గాలకు చుట్టాలుగా పనిచేసేటట్లు చేస్తున్నారు. వ్యాపార, ఉద్యోగవర్గాలను, పాలిత వర్గాలు ఎప్పుడూ నియంత్రిస్తూనే ఉంటాయి..

Advertisement.

పాలకవర్గం తమ జీతాలు, ఆదాయాలు తామే నిర్ణయించుకొంటారు. వ్యాపారులు తాము అమ్మే వస్తువుల రేట్లు తామే నిర్ణయించుకొనగలరు. ఉద్యోగులు తమ జీతాలను తాము పాలక వర్గముతో లాబీయింగ్ చేసి పెంచుకోగలుగుతున్నారు. కానీ కార్మికుడి కూలి, కర్షకుడి పంట రేటు మాత్రము పాలకుల, వ్యాపారుల చేతుల్లోనే ఉంటున్నది.

అనాదిగా దోపిడీకి గురవుతున్నది మాత్రము ఈ కార్మికులు, కర్షకులు మాత్రమే. ఉద్యోగులు (మేధావులు) అన్నీ తెలిసి కూడా పాలకులను, వ్యాపారులను ఎదిరించే ధైర్యము లేక మౌనము వహిస్తున్నారు.

జనాభాలో నేటి పాలకుల, వ్యాపారుల జనాభా శాతము చాలా తక్కువ. ఇది సుమారు ఐదు లేదా ఆరు శాతము మాత్రమే ఉంటుంది. కానీ వీరు మిగిలిన మొత్తము జనాభానే నియంత్రిస్తూ, ఆధిపత్యము చెలాయిస్తున్నారు. అణచివేయబడ్డ కార్మిక కర్షకుల్లో చైతన్యము రాకుండా ఉండడము కోసము చోకబారు వెల్ఫేర్ స్కీములు పెడుతూ వారిని నిత్య పరాన్న జీవులుగా మారుస్తున్నారు.

ఉత్పత్తి, ఉత్పాదకత ను పెంచకుండా, ప్రభుత్వ వ్యయాన్ని అంతటిని సంక్షేమ రంగాలలో మాత్రమే ఖర్చుచేసే నేటి ప్రభుత్వాలు మరల రాకూడదు. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే, ప్రజలను స్వయం ప్రకాశకులుగా మార్చే “జనసేన” లాంటి కొత్త పార్టీలు, కొత్త ప్రభుత్వాలు రావాలి. అప్పుడే మార్పు సాధ్యము. అప్పుడే సమసమాజము వస్తుంది..

Advertisement.

Share This:

1,270 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × two =