పెద్ద నోట్ల రద్దు వ్యవహారం., సామాన్య ప్రజానీకానికి రోజు రోజుకీ కొత్త కష్టాలు కొని తెచ్చిపెడుతున్నాయి.. ప్రధాని నిర్ణయం ప్రకటించి రెండు వారాలు దాటినా., బ్యాంకుల వద్ద జనం పడిగాపుల్లో ఎలాంటి మార్పులేదు.. పైగా తాజాగా నోట్ల మార్పిడికి బ్రేక్ వేస్తూ మరో నిర్ణయం ప్రకటించింది.. ఎంతటి అవసరమున్నా., అర్జెంటు అయినా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూల్లో నిలబడక తప్పదు.. బ్యాంకు టైం అయిపోతే రెండో రోజు మళ్లీ క్యూ రెఢీ. ఇంకా మాట్లాడితే కొన్ని బ్యాంకుల్లో అసలు డబ్బే ఉండడం లేదు.. మా కష్టాలు తీరే మార్గమేది అని జనం నిలదీస్తే., కేంద్రం ఇంకా కొన్ని రోజులు కష్టపడక తప్పదంటూ చేతులు దులిపేసుకుంటోంది.. ఇంకా మాట్లాడితే కార్డుల ద్వారా నగదు బదిలీలు చేసుకో మంటోంది.. ముందస్తు కసరత్తులు లేకుండా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం., పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది.. తాజాగా కర్నూలు ఎస్బిఐ శాఖలో గంటల తరబడి క్యూల్లో నిలబడలేని పరిస్థితుల్లో బాలరాజు అనే వ్యక్తి మరణించారు.. దీంతో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న జనసేనాని., తీవ్రస్వరంతో గొంతెత్తారు.. ప్రజలు పడుతున్న కష్టాల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.. మృతుడు బాలరాజు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ., ఆయన ఫొటోని పోస్ట్ చేసిన పవర్‌స్టార్., డబ్బు కోసం ఆయన బ్యాంకు క్యూల్లో పడిన కష్టాల్ని ప్రస్తావించారు..
ప్రజల కష్టాలు మీకు పట్టవా అంటూ బీజేపీ ఎంపిలను తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.. మీరూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో నిలబడండి అప్పుడే ప్రజలు పడుతున్న కష్టాలేంటో మీకు తెలుస్తాయన్నారు.. వారికి అండగా నిలబడి మద్దతు ప్రకటిస్తే జనానికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుందని సెటైర్ వేశారు.. ఇంకా ఎన్నాళ్లు జనం ఈ కష్టాలు పడాలని ప్రశ్నించారు.. ఇంకా ఎంత మంది ప్రాణాలు బలివ్వాలని జనసేనాని ప్రశ్నించారు.. సమస్య పరిష్కారం అయ్యే మార్గం చూడాలని డిమాండ్ చేశారు.