Home / ఎడిటోరియల్స్ / ప్రాణాలు తోడేస్తున్న భూగ‌ర్భ గ‌ర‌ళం.. వ‌ల్ల‌కాడుగా మారిన ఉద్దానం..

ప్రాణాలు తోడేస్తున్న భూగ‌ర్భ గ‌ర‌ళం.. వ‌ల్ల‌కాడుగా మారిన ఉద్దానం..

ఉద్దానం.. సిక్కోలుగా పిలువ‌బ‌డే శ్రీకాకుళం తీర‌ప్రాంతంలోని ఓ ప్రాంతం.. ఇచ్ఛాపురం డివిజ‌న్‌లోని ఆరు మండ‌లాలు సుమారు 120కి పైగా గ్రామాలు.. ఇంత‌టి మారుమూల ప్రాంతం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధ్య‌య‌నానికి వేదిక అయ్యింది.. అందుకు కార‌ణం., ఈ ప్రాంతానికి ప‌ట్టిన మాయ‌రోగం.. జ‌నం ప్రాణాల్ని నిలువునా తోడేస్తోంది.. అంతుప‌ట్ట‌ని రోగం ప్ర‌జ‌ల మూత్ర‌పిండాల‌ని ప‌ట్టిపీడిస్తోంది.. ఈ రోగం సోకిందంటే ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందే.. ఉద్దానం ఏరియాలో ఈ అంతుప‌ట్ట‌ని రోగ పీడితులు సుమారు 70 వేల వ‌ర‌కు ఉన్నారంటే., అక్క‌డ ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది.. ఇప్ప‌టికే నాలుగు వేల మందికి పైగా ప్ర‌జ‌లు కిడ్నీలు చెడిపోయి మృత్యువు ఒడికి చేరారు.. ఎప్పుడు ఈ రోగం ఎవ‌రిని క‌భ‌ళిస్తుందోన‌న్న భ‌యం గుప్పెట్లో జ‌నం కాలం వెళ్ల‌దీసే ప‌రిస్థితి..

dambj_20090115_0222_2

వేలాది మంది ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్న ఈ అంతుప‌ట్ట‌ని రోగం అస‌లు ఎందుకు వ‌స్తోంది.. అనే అంశంపై అధ్య‌య‌నాలు కూడా సాగాయి.. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్, కేజీహెచ్ రీసెర్చ్ బృందాలు ఇక్క‌డ ప‌రిశోధ‌న‌లు కొన‌సాగించాయి.. వ్యాధిగ్ర‌స్తుల ర‌క్తం న‌మూనాల‌తో పాటు ఆ ప్రాంతంలో భూగ‌ర్భ‌జ‌లాలు, మ‌ట్టి శాంపిల్స్ సేక‌రించారు.. ప్ర‌జ‌ల‌కు సోకిన వ్యాధిని క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా గుర్తించారు.. అందుకు కార‌ణం భూగ‌ర్భ జెలాల్లో పేరుకుపోయిన సిలికా లెవ‌ల్సే కార‌ణ‌మ‌ని తేల్చారు.. అంతేకాదు మ‌ట్టిలో టాక్సిక్ మెటీరియ‌ల్స్ కూడా ఉన్నాయ‌ని నిర్ధారించారు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితులు కేవ‌లం రెండు ప్రాంతాల్లో మాత్ర‌మే ఉన్న‌ట్టు తేలింది.. అందులో ఓ ప్రాంతం శ్రీలంక‌లో ఉంటే., రెండోది ఉద్దానం..

మ‌రి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేదా..? అంటే.. స్వ‌చ్చ‌మైన ర‌క్షిత మంచినీటిని ప్ర‌తి ఒక్క‌రికీ అందించ‌గ‌లిగితే., ఈ స‌మ‌స్య‌పై స‌గం గెలిచిన‌ట్టే.. ఇక ఇప్ప‌టికే వేలాదిగా ఉన్న రోగుల‌కు అందుబాటులో వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించ‌గ‌లిగితే., మృత్యువు ఒడికి చేరువైన కొంద‌రినైనా ర‌క్షించ వ‌చ్చు.. ఉద్దానం ప్రాంతంలో మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్లు., డ‌యాల‌సిస్ యూనిట్లు రెండూ లేవు.. మంచినీరు కేవ‌లం నాలుగో వంతు ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే అందుతుంది.. ఇక మూత్ర‌పిండాల వ్యాధితో పోరాడుతున్న రోగులు డ‌యాల‌సిస్ చేయించుకోవాలంటే., సుమారు 150 నుంచి 200 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి., శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి గాని., విశాఖ‌కు గాని చేరుకోవాల్సి ఉంటుంది..

ఉద్దానం ప్రాంతంలో ఈ స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు.. అయితే జ‌నం పిట్ట‌ల్లారాలిపోతున్నా., వేలాది మంది అంతుచిక్క‌ని రోగాలతో బాధ‌ప‌డుతున్నా., వారి క‌ష్టాలు పాల‌కుల‌కి క‌న‌బ‌డ‌వు, వారి రోధ‌న‌లు విన‌బ‌డ‌వు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే ఉద్దానం స‌మ‌స్య ఖ‌చ్చితంగా పార్టీల మేనిఫెస్టోలో ఉంటుంది.. ఎన్నిక‌ల త‌ర్వాత ఆ హామీ కాగితాల్లో క‌లిసి పోతుంది.. టీడీపీ స‌ర్కారు కూడా అదే ప‌ని చేసింది.. ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డ ర‌క్షిత మంచినీటిని అందించ‌డం విష‌యం ప‌క్క‌న పెడితే., ఇన్ని వేల మంది రోగులు ఉన్న ప్రాంతంలో ఓ డ‌యాల‌సిస్ యూనిట్ పెట్ట‌డం కూడా ప్ర‌భుత్వం త‌లుచుకుంటే పెద్ద‌ప‌ని కాదు.. అక్ష‌రాలా 6 వేల 104 కోట్ల హెల్త్ బ‌డ్జెట్ నుంచి పై నాలుగు కోట్లు కేటాయించినా., ఎంతో మందికి ఉప‌స‌మ‌నం క‌లుగుతుంది.. అయితే పాల‌కులు మాత్రం ఆ ప్ర‌య‌త్నం కూడా ఎప్పుడూ చేయ‌రు.. అందుకే ఉద్దానం ప్ర‌జ‌లు., త‌మ‌ను ఆదుకునే నాధుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు..

Share This:

1,266 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − eleven =