అబద్దాలు చెప్పడంలో, తిమ్మినిబమ్మి చేసి చూపడంలో మన నాయకులు ఎంత ఆరితేరారో జనం ముందు పెట్టారు.. వేల ఆత్మబలిదానాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.. ప్రత్యేక హోదా విషయంలో మీరేం చేస్తున్నారని బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల్ని ఆయన ప్రశ్నించారు.. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.. పోలవరం బహుళార్దసాధక ప్రాజెక్టు.. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి ఈ మూడు రకాల ప్రయోజనాలు ప్రాజెక్టు లక్ష్యం.. దీని అంచనా 16 వేల కోట్లు.. కేంద్రం కేవలం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే డబ్బిస్తోంది.. మరి పూర్తి నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టుకి జాతీయహోదా ఎలా ఇస్తారని జనసేనాని ప్రశ్నించారు..
జాతీయ రహదారుల నిర్మాణాన్ని ప్యాకేజీలో ఎలా చేరుస్తారో చెప్పాలని పవన్ నిలదీశారు.. అన్ని రాష్ట్రాలతో పాటే ఏపీలోనూ రహదారులు నిర్మిస్తున్నారు.. ఆ 25 వేల కోట్లు ప్యాకేజీలో చేర్చడం ఎవర్ని మోసం చేయడానికో చెప్పాలని డిమాండ్ చేశారు..
టాక్స్ బెనిఫిట్స్ వ్యవహారంలోనూ పాలకుల మోసాన్ని జనసేనాని ఎండగట్టారు.. టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చేశాం.. చాలా పరిశ్రమలు వచ్చేస్తాయని చెబుతున్న నేతలు., ఇక్కడా జనాన్ని అడ్డంగా మోసం చేశారన్నారు.. టాక్స్బెనిఫిట్స్ చట్టబద్దం అంటూ ఓ పేపర్ ముక్కపై చెప్పేందుకు మీకు రెండున్నరేళ్లు పడితే., పరిశ్రమలు పెట్టేందుకు ఎన్ని ఏళ్లు పడుతుంది..? ఉద్యోగాలు రావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఓ స్పష్టత ఇవ్వాలన్నారు.. రాజకీయాల కోసం ఇన్ని అబద్దాలు చెప్పాలా..? అడుగడుగూ ఇంత వంచన అవసరమా అంటూ ప్రశ్నించారు.. కడపలో స్టీల్ పరిశ్రమలు పెడతామన్నారు.. అనంతలో ఆయిల్ రిఫైనరీలు పరిశీలిస్తున్నాం అన్నారు.. అక్కడ మహారాష్ట్రలో ఇవే పరిశ్రమలు పెట్టేశారు.. ఇక్కడ మాటలు., అక్కడ చేతలా.. ప్రజలు అంతా చూస్తూనే ఉన్నారు.. మీ మూలాలు పీకేస్తామంటూ జనసేనాని హెచ్చరికలు జారీ చేశారు..
దుర్గరాజుపట్నం పోర్టు, విశాఖ, విజయవాడల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం అనే అంశాలు కూడా ఇదే కోవకు చెందుతాయన్నారు.. స్థలం చూపండి నిధులు ఇస్తామని కేంద్రం అంటుంది.. వెతికే పనిలో రాష్ట్రం ఉంటుంది.. ఈ లోపే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది.. ఇచ్చిన హామీలు ఎక్కడ.. ఏపీకి న్యాయం ఎక్కడ.. అంటూ కల్లూరి వేదిక సాక్షిగా ప్రశ్నించారు..