ఫార్మా కంపెనీలు పెట్టాల్సి వచ్చినప్పుడు కాలుష్య నియంత్రణ మండలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్కళ్యాణ్ సూచించారు.. గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేశాకే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. జనసేన పోరాటయాత్రలో భాగంగా ఫార్మా కంపెనీల కాలుష్యపు కాటుకి అనారోగ్యం భారిన పడిన పరవాడ మండలంలోని తాడి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల్ని పలుకరించిన పవన్కళ్యాణ్., వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఔషద కంపెనీల కాలుష్యంతో తాము పడుతున్న వెతల్ని తాడి గ్రామస్తులు జనసేనుడి ముందు ఏకరువు పెట్టారు.. నిబంధనలకి విరుద్దంగా ఔషద వ్యర్ధాలను ఫార్మా కంపెనీలు భూమిలో పాతిపెట్టడం కారణంగా భూగర్భజలాలు కలుషితం అయిపోయాయని చెప్పారు.. దీంతో నీరు తాగేందుకే కాదు, వాడికకి కూడా పనికి రాకుండా పోయాయని వాపోయారు.. కాలుష్య జలాల కారణంగా మనుషులు రోగాల భారిన పడుతుంటే,పశువులు మృత్యువాత పడుతున్నాయంటూ జనసేనానికి వివరించారు..
ఫార్మా కంపెనీలు విడుదల చేసే విషవాయువులు మనుషుల ప్రాణాలు హరించి వేస్తున్నాయని తాడి గ్రామస్తులు తెలిపారు.. శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కిడ్నీ సమస్యలు తమకు వేధిస్తున్నాయన్నారు.. స్నానానికి సైతం నిత్యం మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన దుస్థితిని ఆయన ముందు ఉంచారు.. ఔషద కంపెనీలు ఏర్పాటు చేయాలంటే ముందుగా లోపలా, బయటా గ్రీన్బెల్టు ఏర్పాటు చేయాలన్న నిబంధనల్ని యాజమాన్యాలు తుంగలో తొక్కాయని ఆరోపించారు.. తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి, తమను కాపాడాలని జనసేనుడ్ని వేడుకున్నారు..
తాడి సమస్య పరిష్కారానికి తాను ప్రభుత్వంలో లేనన్న ఆయన., తనవంతు సమస్యని ప్రపంచం దృష్టికి అయితే తీసుకువెళ్తానని చెప్పారు.. ప్రభుత్వానికి సమస్య తీవ్రత తెలిసినా, బాధితుల పక్షాన ప్రశ్నించేవాడు లేక పట్టించుకోవడం లేదని ఆరోపించారు.. తాడి గ్రామస్తుల తరుపున జనసేన ప్రశ్నిస్తుందని, అండగా నిలిచి వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు..