Home / జన సేన / వైసీపీ అడ్డంగా దోచేస్తే..టీడీపీ చ‌ట్ట‌బ‌ద్దంగా దోచేస్తోంది-త‌ణుకులో జ‌న‌సేనుడి ఫైర్‌..

వైసీపీ అడ్డంగా దోచేస్తే..టీడీపీ చ‌ట్ట‌బ‌ద్దంగా దోచేస్తోంది-త‌ణుకులో జ‌న‌సేనుడి ఫైర్‌..

అవినీతిలేని పాల‌న‌, ఆడ‌ప‌డుచుల‌కి వ్య‌క్తిగ‌త‌-ఆర్ధిక భ‌ద్ర‌త అనే అంశాలకు జ‌న‌సేన పార్టీ ఎంత‌టి ప్రాధాన్య‌త ఇస్తుందో ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు.. పోరాట యాత్ర‌లో భాగంగా త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించిన ఆయ‌న మ‌హిళా సాధికారత‌, బీసీల‌కి చ‌ట్ట స‌భ‌ల్లో చోటు అనే అంశాల‌పై పార్టీ విధానాన్ని పున‌రుద్ఘాటించారు.. ముఖ్యంగా ఆడ‌ప‌డుచుల‌కి రూపాయి బియ్యం, నిత్యావ‌స‌రాల‌కి బ‌దులు నెల‌కి 2500 నుంచి 3500 న‌గ‌దు నేరుగా అకౌంట్ల‌కి బ‌దిలీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల జ‌న‌సేన పార్టీ బాధ్య‌త‌తో ఉంటుంద‌న్న ప‌వ‌న్‌., ఏ ఆడ‌ప‌డుచుని ఇబ్బంది పెట్టినా తోలు తీస్తామ‌ని హెచ్చ‌రించారు.. గ్యాస్ సిలిండ‌ర్ ఉచితం అంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు.. అవినీతి ర‌హిత పాల‌న అందించ‌గ‌లిగితే., న‌గ‌దు బ‌దిలీతో పాటు ఏదైనా సాధ్య‌మేన‌ని స్ప‌ష్టం చేశారు..

త‌ణుకు స‌భావేదిక నుంచి బాల‌గంగాధ‌ర్ తిల‌క్ రాసిన దేవుడా ర‌క్షించు నా దేశాన్ని.. పెద్ద పులుల నుంచి , పెద్ద మ‌నుషుల నుంచి అనే క‌విత‌ను వినిపిస్తూ.. మాట‌ల తూటాలు విస‌ర‌డం మోద‌లు పెట్టారు.. జ‌గ‌న్ ల‌క్ష కోట్లు దోచుకున్నార‌ని టీడీపీ అంటుంటే., చంద్ర‌బాబు ల‌క్ష‌న్న‌ర కోట్లు దోచేశార‌ని వైసీపీ అంటోంద‌ని., ఇద్ద‌రు క‌లిసి దోచేసిన ఆ రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌తో ఆడ‌ప‌డుచుల‌కి న‌గ‌దు బ‌దిలీ అసాధ్య‌మా, ఉచిత సిలిండ‌ర్ ఇవ్వ‌లేమా, రూపాయికి నాణ్య‌మైన బియ్యం స‌ర‌ఫ‌రా చెయ్య‌లేమా అంటూ ప్ర‌శ్నించారు.. అవినీతి ర‌హిత పాల‌న‌తో జ‌న‌సేన చెప్పిన‌వ‌న్నీ చేసి చూపిస్తుంద‌న్నారు.. రూపాయి బియ్యం తినలేక‌పోతున్నామంటున్న జ‌నం స‌గం తిరిగి అదే రేష‌న్ షాపుకి అమ్మేస్తున్నార‌న్నారు.. స‌గం కోళ్ల‌దాణాకి, స‌గం కాకినాడ పోర్టు నుంచి ఖండాంత‌రాలు దాటిపోతున్నాయ‌న్నారు.. ఇలా చేసేకంటే న‌గ‌దు నేరుగా బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు..

ఇక అగ్ర‌కుల యువ‌త‌కు ఈబీసీ హాస్ట‌ళ్లు ఏర్పాటు చేస్తామ‌న్న జ‌న‌సేనాని., బీసీ రిజ‌ర్వేష‌న్ పెంపుపై సానుకూల‌త‌ని వ్య‌క్తం చేశారు.. వారికి చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామ‌న్నారు.. అన్ని విష‌యాలు మేనిఫెస్టోలో పొందుప‌రుస్తామ‌ని తెలిపారు.. మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే బిల్లుకి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని హామీ ఇచ్చారు..

ఇక రాష్ట్రంలో అభివృద్ది గురించి మాట్లాడుతూ ఆకివీడు వాట‌ర్ ప్రాజెక్టు ద‌గ్గ‌రికి వెళ్తే మంచినీరు కావాల‌ని వృద్దురాళ్లు అడిగార‌ని వాపోయారు.. త‌మ‌కు వ‌స్తున్న నీరు కుడితినీళ్ల‌లా ఉంటున్నాయ‌న్నారు.. టీడీపీ నేత‌లు గోదావ‌రి జిల్లాల్లో నీటి వ్యాపారం మొద‌లుపెట్టార‌న్న జ‌న‌సేనాని., అవ‌స‌రం అయితే గాలికి కూడా రేటు క‌ట్టి అమ్మ‌గ‌ల స‌మ‌ర్ధులంటూ ధ్వ‌జ‌మెత్తారు.. తాగేందుకు స్వ‌చ్చ‌మైన నీరు కూడా ఇవ్వ‌లేనందుకు పాల‌కుల‌కి సిగ్గుండాలంటూ మండిప‌డ్డారు.. మా ప్ర‌భుత్వంలో అవినీతి ఎక్క‌డ అని ప్ర‌శ్నించే చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కి మ‌రోసారి ప‌వ‌ర్ పంచ్ ఇచ్చారు.. క‌ల‌వ‌పాడులో డ్వ‌క్రా మ‌హిళ‌ల పేరిట ఫోర్జ‌రీ సంత‌కాల‌తో నాలుగు కోట్లు తినేశార‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టు యాత్ర పేరిట నెల‌కి 2 కోట్లు తినేస్తున్నార‌ని ఆరోపించారు.. అక్క‌డ ఉన్న క్యాంటిన్ కూడా కృష్ణాజిల్లాకి చెందిన ఓ టీడీపీ నాయ‌కుడిద‌ని జ‌న‌సేన అధినేత ఆరోపించారు.

వైసీపీ వాళ్లు అడ్డ‌గోలుగా దోచేస్తే.. టీడీపీ వాళ్లు చ‌ట్ట‌బ‌ద్దంగా దోచేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఓటు వేసేట‌ప్పుడు ఒకసారి మీ బిడ్డ‌ల భ‌విష్య‌త్తు ఆలోచించుకోవాల‌ని సూచించారు.. టీడీపీ వెన్నుపోటు రాజ‌కీయాల‌పైనా., ఆ పార్టీ నేత‌ల ఆగ‌డాల‌పైనా కూడా త‌ణుకు వేదిక‌గా ప‌వ‌న్ దుమ్మెత్తిపోశారు..

Share This:

1,475 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × four =