Home / జన సేన / జనసేనాని కాకినాడ దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం..

జనసేనాని కాకినాడ దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం..

  • రైతాంగ సమస్యలపై బలంగా గళం విప్పేందుకేనన్న పవన్

కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు సమస్యల మీద తలపెట్టిన ఒక రోజు దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. అందుకు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనబడేలా పోస్టర్ లో వారి బాధలు తెలిచపర్చారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ రియాజ్ లు గోడపత్రిక ఆవిష్కరణలో పాల్గొన్నారు.

అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను దీక్ష తలపెట్టడానికి గల కారణాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు పడుతున్న ఇక్కట్లలో తన దృష్టికి వచ్చిన వాటిని ప్రస్తావించారు. దీక్షకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

మన ఆంధ్రప్రదేశ్ ను దేశానికి అన్నపూర్ణగా మనమంతా చెప్పుకుంటాము. ముఖ్యంగా వరి పంటకు మన రాష్ట్రం ప్రసిద్ధి.. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలు ఈ పంటకు పేరెన్నికగన్నాయి. మన రాష్ట్రంలో సగటున 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఏటా పండుతుండగా అందులో 25 లక్షల క్వింటాళ్లు ఉభయగోదావరి జిల్లాల్లోనే పండుతోంది. రానున్న రోజులలో ఈ పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితి నెలకొంటోంది. వరి పంట వేయడానికి రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి… గిట్టుబాటు ధర లేక, ఖర్చులు సైతం రాబట్టుకోలేక వరి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు..

అనేక మంది ధాన్యం రైతులు తనను కలిసి వారి అవస్థల గురించి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని గత ఆదివారం మండపేట, పరిసర ప్రాంతాలలో పర్యటించాను. రైతులతో స్వయంగా మాట్లాడాను. వారు చెప్పిన మాటలు విన్న తరవాత మాటలలో చెప్పలేనంత బాధ అనిపించింది. వారి దుస్థితిని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించాను.

మండపేటలో జరిగిన రైతు సమావేశంలో మూడు రోజులలో రైతుల  సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో వేయమని ప్రభుత్వాన్ని కోరాను. వారి సమస్యలను పరిష్కరించమని చెప్పాను. ప్రభుత్వంలో చలనం లేదు. 151 మంది బలం కలిగిన వై.సి.పి. ప్రభుత్వం అంతే బలంగా పని చేయవలసి ఉండగా ధాన్యం రైతుల పట్ల కనీస స్పందన చూపలేదు.

జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల సమస్యలను బలంగా తెలియచేయడానికే రైతు సౌభాగ్య దీక్ష తలపెట్టాను. గత రబీ సీజన్లోనే ధాన్యం రైతులు తమ దుస్థితిని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందనుకున్నా.. అది భ్రమగా మిగిలిపోయింది.

గతంలో జగన్ రెడ్డి గారు తన పాదయాత్రలో.. పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టం మిల్డ్ రైస్ (సి.ఎం.ఆర్.) ను ప్రకటించి, ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతా లో డబ్బు వేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ధాన్యం తీసుకున్న 45 రోజుల తరువాత హడావిడిగా అర్ధరాత్రి వేళ సి.ఎం.ఆర్. ప్రకటించి ఇంతవరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దాంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించవలసి వచ్చిందని రైతులు చెబుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు..

  • కౌలు రైతుకు భరోసా కల్పించడంలో కుల వివక్ష ఎందుకు.?

కౌలు రైతులకు రైతు భరోసా కల్పించడంలో కుల విచక్షణ ఎందుకని రైతులు అడుగుతున్న ప్రశ్నలను ఈ ప్రభుత్వం అర్ధం చేసుకోవలసి వుంది. బియ్యం గింజకు లేని కులం పంట పండించే రైతుకు ఎందుకని వారు అడుగుతున్న దానికి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పవలసిన అవసరం వుంది. కులాలకు అతీతంగా కౌలు రైతులు అందరికీ రైతు భరోసా పథకం వర్తింపచేయవలసి వుంది. ఎందుకంటే కౌలు రైతు ఖర్చులతో కుంగిపోతున్నాడు కనుక..

ఎకరాకు 35 వేల రూపాయలు ఖర్చులు అవుతుండగా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరతో ఖర్చులు కుడా రాని పరిస్థితి నెలకొంది. కౌలు రైతులకు అదనంగా మరో 15 వేల రూపాయల కౌలు భారం మోయవలసి వుంది. దీనివల్ల 75 కిలోల బస్తాకు సగటున ఇప్పుడు ఇస్తున్న కనీస మద్దతు ధర 1361 ఉండగా అది 2000 రూపాయలు చేసినప్పుడే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రైతుకు కల్పించవలసి ఉందని స్వామినాథన్ రిపోర్ట్ ఒక పక్క చెబుతుండగా కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. మరి దీనిపై ఆలోచించే వారు ఎవరు? జగన్ రెడ్డి గారికి ఈ విషయం పట్టదా అంటూ నిలదీశారు.

నష్టాలపాలవుతున్నా సమాజంలో గౌరవం కోసం వ్యవసాయం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. కడుపు మండి 2011లో ఒకసారి కోనసీమ రైతులు పంట విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేసారు. ఆనాడు దేశమంతా నివ్వెరపోయింది. అటువంటి ఆగ్రహాన్ని మనం రైతు నుంచి చూడకుండా ఉండాలంటే పాలకులు కళ్ళు తెరవాలి. వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండుగలా చేయాలి.

అటువంటి రోజు కోసమే 12 న దీక్ష తలపెట్టాము. ప్రతీ జనసైనికుడు రైతుకు సంఘీభావం తెలపాలి. వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నించాలి అని అన్నారు..

Share This:

486 views

About Syamkumar Lebaka

Check Also

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 12 =