Home / ఎడిటోరియల్స్ / వైసీపీది దారితప్పిన రాజకీయమా.? దారిమళ్లింపు రాజకీయమా.?

వైసీపీది దారితప్పిన రాజకీయమా.? దారిమళ్లింపు రాజకీయమా.?

ఓ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీతకు కనుమరుగవుతుంది. వారి చర్యలతో ప్రజలను సమస్యల్లోకి నెట్టే రాజకీయ నాయకులు., ప్రజా వ్యతిరేకత పాలకుల పుట్టి ముంచే స్థాయికి వచ్చింది అనుకున్నప్పుడు, సమస్యకు పరిష్కారం చూపలేనప్పుడు కొత్త సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని అటువైపు మళ్లిస్తూ ఉంటారు.. బలమైన ప్రత్యర్ధి ఎదురుపడినప్పుడు, ఆ ప్రత్యర్ధికి ప్రజాబలం పెరుగుతున్నప్పుడు కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయ ప్రయోగం.. పార్టీలో అంతర్గత విబేధాలు సృష్టించే ప్రయత్నం చేయడం, ఆరోపణలకు బదులివ్వలనేప్పుడు వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల దృష్టిని ఆ అంశాల వైపు మళ్లించడం.. తాజాగా సామాజిక మాధ్యమాల సహాయంతో అందివచ్చిన సాంకేతికతను వినియోగించి ప్రత్యర్ధుల పేరిట దుష్ప్రచారాలు వ్యాప్తి చేయడం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం జనరంజక పాలన ముసుగులో రాష్ట్రానికి పార్టీ రంగులు పులమడంతో పాటు పైన చెప్పిన అన్ని రకాల కుయుక్తులతో కూడిన రాజకీయాలు చేస్తోంది.

  • ఇసుక ఉప్పెనను ఆంగ్ల మాధ్యమంతో దారిమళ్లింపు

ఇసుక సమస్య ఉప్పెనగా మారి ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తినప్పుడు, జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడి ఉద్యమించినప్పుడు ఇసుక వారోత్సవాల పేరిట ప్రజలకు ఊరటనిస్తున్నామన్న ప్రచారం మొదలు పెట్టుకుంది. కోట్లు ఖర్చు చేసి పేపర్లలో నా నిజాయితీ ఇది అంటూ ప్రకటనలు గుప్పించింది మినహా ఇప్పటికీ ఇసుక ధర దిగిరాని పరిస్థితి. వరద తగ్గింది, ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఇసుక అందుబాటులోకి వచ్చినా గత ప్రభుత్వ హయాంలో రూ.1500లకు వచ్చిన ట్రాక్టర్ ధర, బహిరంగంగానే ప్రభుత్వం రూ. 5000కు అమ్ముకుంటోంది. ఇసుక కొరత కారణంగా ఆగిపోయిన సామాన్యుడి గూడు, ఇప్పుడు ధరాఘాతం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ ఇసుక సమస్య నుంచి దృష్టిని మళ్లించేందుకు ఆంగ్ల మాధ్యమ బోధన పేరిట జనానికి ఉచ్చు వేసింది. అమలు సాధ్యాసాధ్యాలు, దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు అనుభవంలోకి వస్తే గానీ తెలుసుకోలేని జనం.. అన్నీ మరచిపోయి ఆహా ఓహో అంటూ ఢాకాలు భజాయిస్తున్నారు.. ఉల్లి ధర ఆకాశాన్నంటినా, ఆర్టీసీ విలీనం ముసుగులో ఛార్జీలు భారీగా వడ్డించేసినా ఇవేమీ జనానికి కనబడకపోవడం గమనార్హం.

  • రైతుల గురించి మాట్లాడితే వ్యక్తిగత దూషణలు

ఇక ధాన్యం చేతికి వచ్చే సమయంలో రైతుల వ్యధ అయితే వర్ణణా తీతం.. తమ హామీ అమలుపరుచుకునే క్రమంలో నిజమైన సన్న బియ్యం స్థానంలో లావుగా ఉన్న బియ్యాన్ని సన్నంగా మార్చే ప్రయత్నం చేస్తూ ముక్కలు అంటూ, ముతకలు అంటూ రైతు జేబుకి సున్నం పెడుతోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. అటు ఇసుక వ్యవహారంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ చేయడం, తాజాగా రైతు సమస్యల మీద ఉద్యమించడంతో జనసేన పార్టీ వైసీపీకి గొంతులో పచ్చి వెలగలా తయారయ్యింది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటా కొన్ని లక్షల మందికి చేరుతుందన్న భయం అధికార పార్టీకి కంటి మీద కునుకు కరువయ్యింది. 151 మందితో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఒక్క సీటు ఉన్న జనసేన పార్టీ పేరు కూడా తలవడానికి వీల్లేదు.. ఆ పార్టీకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వరాదు.. అని నిర్ణయం తీసుకున్న జగన్ రెడ్డి., ప్రజలు మొత్తం సమస్యల పరిష్కారానికి జనసేనానే దిక్కు అంటూ ఆయన చుట్టూ తిరుగుతుండడం., ఆయన భవన నిర్మాణ కార్మికుల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్, రైతుల సమస్యల మీద పోరుబాటతో వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడో కాలింది.. భావి భారత పౌరులైన చిన్నారులకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వాల్సిన వేదిక దగ్గర నుంచి ప్రజా సమస్యలు ప్రస్తావించే పవిత్ర దేవాలయం వరకు అవకాశం చిక్కిన ప్రతి చోటా జనసేనుడిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడి తమ కడుపు మంటను చల్లార్చుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ప్రజా సమస్యలు పరిష్కరించమంటే దానికి వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు ఒకటే ఊకదంపుడు కబుర్లు చెబుతూ దాన్ని అనుంగ మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపేస్తున్నారు.

  • ప్రత్యర్ధి పార్టీల్లో అంతర్గత విబేధాల సృష్టి

వైసీపీ నేతల వ్యక్తిగత దాడులు, వక్రభాష్యాలను ప్రజలు ఏవగించుకోవడంతతో.., వ్యూహం రెండుకు పదును పెట్టింది. అదే పార్టీలో అంతర్గత చిచ్చు పెట్టడం.. దీనికి కొందరు పెయిడ్ పాత్రికేయుల సహాయం కూడా తీసుకోవడం గమనార్హం. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో ఆంగ్ల మాధ్యమం గురించి చెప్పిన అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటూ తన పెయిడ్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టుల సహాయంతో పార్టీకీ, ఎమ్మెల్యేకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేశారు. పార్టీ రాపాకకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది అంటూ ఓ ఫేక్ ప్రెస్ నోట్ తయారు చేసి మరీ తన ప్రత్యర్ధుల మీద అసత్య  కథనాలతో దాడిచేసేందుకే పుట్టిన గ్రేట్ ఆంధ్ర న్యూస్ పోర్టల్ లో వార్తాకథనం ప్రచురించింది. ఆ కథనం ఉద్దేశ పూర్వకంగా ప్రచురించకుంటే., జనసేన పార్టీ విడుదల చేసే ఏ ప్రెస్ నోట్ అయినా మీడియా గ్రూప్ ద్వారా, పార్టీ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా  విడుదల చేస్తుందని తెలిసీ, అక్కడ నిర్ధారించుకోకుండా ఇలాంటి వార్తను ప్రచారం చేయడం., సాక్షి వ్యవహారంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి.

  • ఫేక్ ప్రెస్ నోట్ల ప్రవాహం

పాచిక పారకపోవడంతో అసలు లేని షోకాజ్ నోటీసుపై ఏకంగా రాపాక స్పందించేసినట్టు., పార్టీ అధినేతపై పరుష పదజాలం ప్రయోగించినట్టుగా ఓ కల్పిత వార్తను సృష్టించి ఏకంగా మీడియా గ్రూపుల్లో సైతం సర్క్యులేట్ చేశారు.. ఈ వ్యవహారంలో జనసేనాని పార్టీ శ్రేణులు, నాయకులు అధినేత స్ఫూర్తితో సంయమనం పాటించడంతో., అది ప్రత్యర్ధుల పన్నాగమేనన్న విషయం తేటతెల్లం అయ్యింది.

  • ఫేక్ ప్రెస్ నోట్ల తీగ కదలబోతోంది

జనసేన పార్టీ లెటర్ ప్యాడ్ ని ఫోటో షాప్ లో ఎడిట్ చేస్తూ., పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేసే ప్రక్రియ ఎన్నికల ముందు నుంచి మొదలయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే., జనసేనకు వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక, ఫేక్ ప్రెస్ నోట్లతో పార్టీ నుంచి ప్రజల దృష్టి మళ్లింపు చర్యలు మళ్లీ మొదలయ్యాయి. మొన్న రాపాకకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా ఒక ప్రెస్ నోట్ ఇచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు తాజాగా బీజేపీలో పార్టీని విలీనం చేస్తున్నారనే అర్ధం వచ్చే విధంగా మరో ఫేక్ ప్రెస్ నోట్ సామాజిక మాధ్యమాల్లోకి పంపారు.. ఈ తప్పుడు ప్రచారం ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీసే పనిని జనసేన పార్టీ మొదలు పెట్టింది.. తీగ లాగితే ఎవరి డొంక కదులుతుందో చూడాలి.

  • పార్టీ నాయకులపై సత్యదూర ప్రచారాలు

ఇక జనసేన పార్టీ లక్ష్యంగా వైసీపీ ప్రయోగిస్తున్న మరో చీప్ ట్రిక్.. పార్టీ అధినేతతో పాటు వైసీపీకి కంట్లో నలుసులుగా మారిన ఆ పార్టీ నేతల లక్ష్యంగా తప్పుడు ప్రచారం. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ డమ్మీ అయిపోయింది కదా అని జగన్ రెడ్డి సంతోషించే లోపే., బలమైన నాయకుడిగా, ప్రభల శక్తిగా ఎదుగుతున్న జనసేన అధినేతను చూసి కునుకు కరువైన పరిస్థితి. దీంతో ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ, వైసీపీ నాయకులంతా వరుస క్రమంలో వ్యక్తి గత దూషణలకు దిగుతూ సంతృప్తి చెందుతున్నారు.

ఇక సామాజిక మాధ్యమాల్లోనూ, మీడియా చర్చల్లోనూ, క్షేత్ర స్థాయిలో చురుగ్గా ఉన్న నాయకుల గురించి కూడా తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు.. మొన్నటికి మొన్న పంచకర్ల సందీప్ లక్ష్యంగా చేసిన ప్రచారం, నిన్న పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడిని టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. తమ పార్టీ నేతలను గుక్కతిప్పుకోనివ్వడం లేదన్న అక్కసుతో ఆంధ్రజ్యోతి పేపర్ ను మార్ఫింగ్ చేసి మరీ ఆత్మ సంతృప్తి చెందారు. పార్టీకి సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా అందులోకి కూసంపూడి శ్రీనివాస్ ని లాగడం వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులకు అలవాటుగా మారింది. తాజాగా రాపాక ఎపిసోడ్ లోకి కూడా ఆయన్ని లాగడం అధికార పార్టీ ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందో అర్ధం అవుతోంది. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారిని ఎదురుగా ఏమీ చేయలేక, వారిని పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు చేస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో అష్ట కష్టాలూ పడ్డాం మీరైనా మాకు న్యాయం చేయండి అని 151 మందిని గెలిపిస్తే., ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి., సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం, రాజకీయ లబ్ది కోసం దారితప్పిన రాజకీయాలు చేయడం చేస్తోందన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.

Share This:

735 views

About Syamkumar Lebaka

Check Also

అమరావతి గొడవని దారిమళ్లిస్తున్నారా.? రౌడీ రాజ్యం స్థాపనకు బాటలు వేస్తున్నారా..? కాకినాడ రణరంగం వెనుక స్కెచ్ ఏంటి.?

కాకినాడ జనసైనికులపై దాడి ఘటనలో పోలీసుల తీరు పట్ల సర్వత్ర విమర్శల పాలవుతోంది. తాము ఇచ్చిన భూములు కోసం నిరసన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 4 =